: మహిళా రక్షణ చట్టం కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంది: పూనం మాలకొండయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా రక్షణ చట్టం కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తరువాతే పరిష్కారాలు సూచిస్తుందని కమిటీ కన్వీనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణ, భద్రతపై ఈ నెల 20న తెలంగాణ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇస్తామని అన్నారు. సమస్యపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాల మహిళలను సంప్రదిస్తున్నామని ఆమె వెల్లడించారు. త్వరలో కాలేజీ యువత, గృహిణులతో చర్చించనున్నామని, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించనున్నామని ఆమె చెప్పారు. అత్యాచారాల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు ఉండేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు.