: పాకిస్థాన్ కు గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తి చెన్నైలో అరెస్టు


కొలంబోలోని పాకిస్థాన్ హై కమిషన్ తరపున గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ చెన్నైలో అరెస్టు చేసింది. శ్రీలంకకు చెందిన అరుణ్ సెల్వరాజన్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి చెన్నైలోని కీలక భద్రతా సంస్థల వివరాలను ఫొటోలు, వీడియో రూపంలో రహస్యంగా పాక్ కు చెందిన కొంతమందికి పంపుతున్నట్లు తెలియడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హబ్, ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ, కోస్ట్ గార్డ్ సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు చెన్నైలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని స్థాపించాడు. దాని ద్వారా చాలా తేలికగా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నాడట. తమిళ సంతతికి చెందిన లంక జాతీయుడైన సెల్వరాజన్ నకిలీ పత్రాలతో పాస్ పోర్టు సంపాదించి చెన్నైలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని ప్రారంభించినట్లు టెర్రరిస్టు వ్యతిరేక దళం అధికారి ఒకరు చెప్పారు. ఈ క్రమంలో అతను కొన్ని సున్నిత ప్రదేశాలు, చెన్నైలో అనేక రద్దీ ప్రదేశాలను వీడియో తీసినట్లు వివరించారు. అంతేగాక, అతను విశాఖపట్నం కూడా వెళ్లాడని, అక్కడ నావల్ కేంద్రాలను ఫోటోలు, వీడియో తీశాడని, వాటిని కొలంబోలోని పాకిస్థానీ వ్యక్తికి చేరవేశాడనీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News