: మన 'అణు క్షిపణి' ప్రయోగం గ్రాండ్ సక్సెస్
భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అగ్ని-1 క్షిపణిని గురువారం నాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ సైనిక స్థావరం నుంచి ఈ దేశీయ తయారీ సర్ఫేస్-టు-సర్ఫేస్ మిస్సైల్ ను ప్రయోగించారు. 700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది తుత్తునియలు చేయగలదు. ఒక టన్ను అణు వార్ హెడ్ ను మోసుకుని వెళ్ళగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ప్రయోగంపై టెస్ట్ రేంజ్ డైరక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ మాట్లాడుతూ, 'కచ్చితమైన ఫలితం' వచ్చిందని తెలిపారు. కాగా, అగ్ని-1 మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్. 'పృథ్వి' క్షిపణిని మరింత అభివృద్ధి పరిచి దీన్ని రూపొందించారు. ఇందులో సాలిడ్ ప్రొపల్షన్ బూస్టర్, లిక్విడ్ ప్రొపల్షన్ (అప్పర్ స్టేజ్) సాంకేతికతను పొందుపరిచారు.