: 'మధ్యాహ్న భోజనం'లో ఇవి కూడా దర్శనమిస్తాయి!
మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోందన్న విషయంలో తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులు భోజనంలో కనిపించిన కప్పను చూసి ఆశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్ పూర్ జిల్లా బాద్ గావ్ గ్రామంలోని సతీ సమరక్ ఇంటర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చచ్చిన కప్ప ఉండడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారి పరంజీత్ సింగ్ గుర్తించారు. అప్పటికే, ఆ ఆహారం తిన్న ముగ్గురు విద్యార్థులతో పాటు, విద్యార్థులకు వడ్డించే ముందు ఆహారాన్ని రుచి చూసిన ఇద్దరు లెక్చరర్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆ ఆహారాన్ని వడ్డించడం నిలిపివేయాలంటూ ప్రిన్సిపాల్ సూరజ్ భాన్ ఆదేశించారు. సదరు ఆహారం నమూనాలను సేకరించిన పుడ్ సేఫ్టీ విభాగం వాటిని పరీక్షలకు పంపింది. అంతేగాకుండా, చచ్చిన కప్పను గుర్తించకుండా ఆహారాన్ని వండిన స్వచ్ఛంద సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు.