: అంజనీపుత్రుడికి ఆధార్ కార్డు!
పోస్టాఫీసులకు చేరే ఉత్తరాలపై సరైన చిరునామా లేకుంటే, వాటిని చించి, లోపలి వివరాల ఆధారంగా వాటిని సరైన వ్యక్తులకు అందజేసే ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు పోస్ట్ మ్యాన్లు. రాజస్థాన్ లోని సికార్ పోస్టాఫీసుకు కూడా ఇలాంటిదే ఓ అసంపూర్ణ చిరునామా ఉన్న కవర్ వచ్చింది. దానిపై, 'వార్డు నెంబర్-6, దంతారామ్ గఢ్, పంచాయత్ సమితి, సికార్ జిల్లా' అని మాత్రమే ఉంది. దీంతో, ఆ పోస్టాఫీసు సిబ్బంది కవర్ ను చించి చూశారు. దాంట్లో వారికి ఓ ఆధార్ కార్డు కనిపించింది. దానిపై ఆంజనేయుడి ఫొటో ఉంది. కార్డుదారుడి పేరు వద్ద 'హనుమాన్ జీ, సన్నాఫ్ పవన్ జీ' అని కనిపించడంతో పోస్టల్ సిబ్బంది తలపట్టుకున్నారు. ఇప్పుడా కవర్ ను ఎవరికివ్వాలన్నది వారికి సమస్యలా తయారైంది. కార్డుపై ఉన్న మొబైల్ నెంబర్ కు ఫోన్ చేస్తే, అంకిత్ అనే వ్యక్తి లిఫ్ట్ చేశాడు. వివరాలడిగితే, ఆ కార్డుకూ తనకూ సంబంధం లేదని, తన నెంబర్ ఆ కార్డుపైకి ఎలా వచ్చిందో తెలియదని బదులిచ్చాడు. దీంతో, ఇదంతా ఆధార్ కార్డుల జారీ ఏజెన్సీ సిబ్బంది నిర్వాకమై ఉంటుందని ఆ పోస్టల్ సిబ్బంది ఓ అభిప్రాయానికి వచ్చారు.