: వైఎస్ విజయమ్మకు భద్రత ఉపసంహరణపై హైకోర్టులో పిటిషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత నెల 22న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా విజయమ్మ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, కడప జిల్లా ఎస్ పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకెటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని విజయమ్మ పిటిషన్ లో తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ గత నెల 31న ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆరోపించారు. అటు వైఎస్ జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా తమ భద్రత ఉపసంహరణపై వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడింటిపై కోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.