: ఆ విషయంలో ఆస్ట్రేలియా ప్రియం... భారత్ ఎంతో నయం!
గ్లోబలైజేషన్ ఊపందుకున్న తర్వాత ఉన్నత విద్య కోసం యువత ప్రపంచం నలుమూలలకూ వెళుతోంది. కొన్నాళ్ళ క్రితం అమెరికా, ఇంగ్లండ్, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాలకు విదేశీ విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడా దేశాల స్థానాలను భారత్, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్ వంటి దేశాలు ఆక్రమించాయి. సాధారణంగానే విదేశాల్లో విద్య అంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం అన్ని దేశాల కంటే ఆస్ట్రేలియాలో ఆ వ్యయం అధికమట. ఈ విషయంలో భారత్ నయమంటోంది ఓ నివేదిక. హెచ్ఎస్ బీసీ బ్యాంకు చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం కంగారూ దేశంలో విద్య విదేశీయులకు అత్యంత ఖరీదైనది కాగా, భారత్ లో అత్యంత చవకట. ఆస్ట్రేలియా వర్శిటీల్లో ఓ విదేశీ విద్యార్థికి ఫీజుల రూపేణా, జీవనవ్యయం రూపేణా ఏడాదికి పాతిక లక్షల రూపాయలు పడుతోంది. అదే, భారత్ విషయానికొస్తే రూ.3.4 లక్షలతోనే ఏడాది పూర్తిచేయవచ్చు. విద్యాభ్యాసం పరంగా అత్యంత ఖరీదైన దేశాల్లో ఆస్ట్రేలియా తర్వాత సింగపూర్ నిలిచింది. గతేడాది ఈ జాబితాలో సింగపూర్ ఆరోస్థానంలో ఉంది. 15 దేశాల్లోని టాప్10 విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజుల సగటు ఆధారంగా హెచ్ఎస్ బీసీ ఈ నివేదిక రూపొందించింది. అధ్యయనంలో భాగంగా ఆయా దేశాల్లోని 4,500 మంది తల్లిదండ్రులను నాణ్యమైన విద్య అందించే దేశాల గురించి అడిగారు. అందులో దాదాపు 62 శాతం భారతీయులు నాణ్యమైన విద్య అమెరికాలో లభ్యమవుతుందని చెప్పారు. ఆ తర్వాతి స్థానాలను వారు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలకు ఇచ్చారు.