: లాభాలతో నడుస్తోన్న ప్రభుత్వ రంగసంస్థల్లో వాటాల అమ్మకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్


మంచి లాభాలు ఆర్జించి పెడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, సెయిల్ లాంటి సంస్థలలో వాటాలు అమ్మాలని కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థల్లో వాటాలు అమ్మడం ద్వారా సుమారు 45వేల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ఆర్జించవచ్చని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఓన్‌జీసీలో అయిదు శాతం వాటా అమ్మేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తిరంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి దాదాపు 69శాతం వాటా వుంది. మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ వాటా పరిమాణం 64 శాతానికి పడిపోనుంది. 2012లో మన్మోహన్‌ ప్రభుత్వం అయిదు శాతం వాటాలు అమ్మేయగా, ఇప్పుడు మరో అయిదు శాతాన్ని అమ్మేయాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీలో అయిదు శాతం వాటాలు అమ్మితే ప్రభుత్వానికి 19 వేల కోట్ల రూపాయలకు పైగా సమకూరుతాయని కేంద్రం అంచనా వేస్తోంది . అలాగే, మంచి లాభాలతో నడుస్తోన్న కోల్‌ ఇండియాలో కూడా పది శాతం వాటాలు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న కోల్‌ ఇండియాలో ప్రభుత్వానికి దాదాపు 90 శాతం వాటా వుంది. మోడీ కేబినెట్‌ తాజా నిర్ణయంతో కోల్‌ ఇండియాలో ప్రభుత్వ వాటా 80 శాతానికి పడిపోనుంది. కోల్‌ ఇండియాలో పది శాతం వాటాలు అమ్మితే సుమారు 24 వేల కోట్ల రూపాయలు సమకూరుతాయని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీలో 11 శాతం, సెయిల్‌లో 5 శాతం, ఆర్‌ఐఎన్‌ఎల్‌, హెచ్‌ఏఎల్‌లో పదిశాతం చొప్పున వాటాలు విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News