: ఛార్జిషీట్లంటే గోల్డు మెడల్సా?... రాజకీయాల నుంచి తప్పుకో!: జగన్ పై సోమిరెడ్డి ఫైర్


జగన్ ఆస్తుల కేసులో దాఖలైన 11 ఛార్జిషీట్లను వైఎస్సార్సీపీ నేతలు 11 గోల్డు మెడల్స్ లా ఫీలవుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అతిపెద్ద ఆర్ధిక నేరగాడు ప్రతిపక్షనేతగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఆ పార్టీలో అంతకంటే పెద్ద నాయకుడు లేడా? అని ప్రశ్నించారు. జగన్ కారణంగా రాజకీయ నాయకులంతా తలెత్తుకోలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్, బాబు వంటి మహామహులు కూర్చున్న ప్రతిపక్షనేత స్థానంలో ఆర్ధిక నేరగాడు కూర్చోవడం సరైనదేనా? అన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ఆలోచించాలని సోమిరెడ్డి సూచించారు. వైఎస్ హయాంలో జరిగిన దోపిడీని కాగ్ వేలెత్తి చూపిందని ఆయన తెలిపారు. జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రతిపక్షనేత హోదా నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా దీక్ష చేస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. జగన్ తక్షణం రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News