: రిబ్బన్లు కట్టుకోలేదని జుట్టు కత్తిరిస్తే... మంత్రాలు వేస్తోందని మండిపడ్డారు!
బాల్యం నుంచే క్రమశిక్షణ అలవడాలి అని చాలా సందర్భాల్లో మేధావులు అభిప్రాయపడుతుంటారు. క్రమశిక్షణ అలవడాలి... కానీ, క్రమశిక్షణ కోసమని టీచర్లు శిక్షించకూడదని షరతులు కూడా విధిస్తుంటారు. ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో తమాషా సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థినులు చక్కగా తల దువ్వుకుని, జడలు వేసుకుని రిబ్బన్లు కట్టుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పాటిస్తున్నాయి. కామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో రిబ్బన్లు కట్టుకుని రాలేదని విద్యార్థినుల జట్టు కత్తిరించిందో టీచర్. దీంతో, విద్యార్థినులు జరిగినది వారి తల్లిదండ్రులకు వివరించారు. వారంతా టీచర్ మంత్రాలు వేస్తోందని, తాంత్రిక విద్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, సదరు టీచర్ ను నిలదీశారు. దీంతో, ఆ టీచర్ క్రమశిక్షణ అలవడాలనే ఉద్దేశంతో తానాపని చేశానే తప్ప తనకు మంత్రాలు, తంత్రాలు తెలియవని లబోదిబోమంది. తనను ప్రశ్నించేందుకు వచ్చిన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి వివాదం ముగించింది.