: ఐఎస్ఐఎస్ పై ఏ క్షణంలోనైనా అమెరికా వైమానిక దాడులు!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపుపై వైమానిక దాడులకు అమెరికా సిద్ధమైంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాలు జారీచేస్తే చాలు, సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించేందుకు అమెరికా వాయుసేన ఫైటర్ జెట్లు కాచుకుని ఉన్నాయి. అయితే, ఒబామాను పలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. వైమానిక దాడుల అనంతరం... మిలిటెంట్లపై భూతల దాడులు ఏ రీతిలో చేయాలి? ఎలాంటి వ్యూహం అనుసరించాలి? సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసాద్ సాయం లేకుండా ఆ దేశంలో ఎలా దాడులు చేపట్టాలి? శక్తిమంతమైన టర్కీ, సౌదీ అరేబియాలను ఈ దాడుల్లో ఎలా భాగస్వాములను చేయాలి? అని ఒబామా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం అమెరికన్లను ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ఐఎస్ఐఎస్ గ్రూపును తుదముట్టించడమే తమ ధ్యేయమన్న ఉద్దేశాన్ని ఈ సందర్భంగా అధ్యక్షుడు జాతికి వివరిస్తారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.