: కేరళకు బై చెబుతున్న విదేశీ టూరిస్టులు
కేరళలో ఇప్పుడు మద్య నిషేధం పవనాలు వీస్తున్నాయి. శుక్రవారం నుంచి అక్కడి బార్లు, వైన్ షాపులు మూతపడనున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్ళను ఇందుకు మినహాయించారు. ఆదివారం నాడు ఆ ఐదు నక్షత్రాల హోటళ్ళలోనూ మందు దొరకదు. ఈ మేరకు అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, కేరళ అందాలను వీక్షించేందుకు ప్రతి ఏటా వేల సంఖ్యలో విదేశీయులు వస్తుంటారు. వారికి మందు లేనిదే గడవదన్న విషయం తెలిసిందే. ఈ 'గాడ్స్ ఓన్ కంట్రీ'లో ఇప్పుడు మద్య నిషేధం ప్రకటించడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు. దీనిపై బ్రిటీష్ పర్యాటకుడు జాన్ ప్యాకర్ మాట్లాడుతూ, "ఇలాంటి పరిస్థితి నాకు చెల్లుబాటు కాదు" అన్నాడు. "విహారయాత్రకు వెళ్ళినప్పుడు బీర్లు తాగడాన్ని ఆస్వాదిస్తాను. మరి ఇక్కడే ఉంటే బీర్లు దొరక్క ఎంత కష్టపడాలో!" అని వాపోయాడు. ఒక్క ప్యాకరే కాదు, ఎంతో మంది విదేశీయులు ఇప్పుడు కేరళ వచ్చేందుకు సుముఖంగా లేరు. దీనిపై బార్ యాజమాన్యాలు ఆశావహ దృక్పథం కనబరుస్తున్నాయి. చివరి నిమిషంలో సర్కారు మనసు మారకపోతుందా? అని వేచి చూస్తున్నాయి. కానీ, ఈ విషయంలో సర్కారు కఠినవైఖరి అవలంబిస్తుండగా, న్యాయవ్యవస్థ అయినా ఈ విషయంలో సరైన నిర్ణయం వెలువరిస్తుందని బార్ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.