: తెలంగాణ అభివృద్దే నా లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ మంచి నీరు అందించే విషయంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని టీఎస్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఇంటికీ నీరు ఇవ్వడమే వాటర్ గ్రిడ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న ఆచార్య జయశంకర్ వర్శిటీలో వాటర్ గ్రిడ్ అంశంపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయలు వెచ్చించే పథకాలు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... సమగ్ర మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం దాదాపు 10 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.