: 'లవ్ జిహాద్' కు పోటీగా 'లవ్ త్రిశూల్' బ్యాచ్
ఉత్తరప్రదేశ్ లో పెనుదుమారం రేపుతున్న 'లవ్ జిహాద్'కు కౌంటర్ గా శివసేన పార్టీ 'లవ్ త్రిశూల్' ను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరైనా 'లవ్ జిహాద్'లో భాగంగా హిందూ అమ్మాయిలను మభ్యపెట్టినట్టు వార్త రావడమే ఆలస్యం ఈ 'లవ్ త్రిశూల్' బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. తొలుత 'లవ్ త్రిశూల్'ను బరేలీలో ప్రారంభిస్తామని, అనంతరం, దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని శివసేన పార్టీ యూపీ విభాగం అధ్యక్షుడు అనిల్ సింగ్ తెలిపారు. ప్రేమ వల, మత మార్పిడి నుంచి హిందూ యువతులను రక్షించడమే తమ ధ్యేయమని ఆయన చెప్పారు. కాగా, లవ్ జిహాద్ పేరు ఇటీవల మార్మోగిపోతుండడం పట్ల సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మాట్లాడుతూ, 'లవ్' 'జిహాద్' అనేవి పవిత్రమైన పదాలని, వాటిని అపవిత్రం చేయరాదని అన్నారు. ఆ రెండు పదాలను ఉపయోగించి వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నించేవారిని చట్ట ప్రకారం శిక్షించాలని పేర్కొన్నారు.