: ములాయం! నీకు భారత్ లో ఉండే అర్హత లేదు... తక్షణం పాక్ వెళ్లిపో: భాజాపా ఎంపీ
ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఉపఎన్నికల్లో ఆ పార్టీకి 'స్టార్ క్యాంపెయినర్' గా వ్యవహరిస్తోన్న బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు భారతదేశంలో ఉండే కనీస అర్హత లేదని ఆయన విరుచుకుపడ్డారు. ఆయన తక్షణం ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఆదిత్యనాథ్ సూచించారు. ములాయం పూర్తిగా ముస్లిం పక్షపాతి అని... ఉత్తరప్రదేశ్ లో హిందువులు ప్రశాంతంగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో హిందూ అమ్మాయిలపై జరుగుతోన్న 'లవ్ జిహాద్'పై ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ముస్లిం యువకులను సమాజ్ వాదీ పార్టీ వాళ్లు వెనకేసుకొస్తున్నారని... అందుకే ఇలాంటి విపరీత ఆగడాలకు వారు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు కిడ్నాప్ చేసి వారిని జిహాదీలుగా మారుస్తున్నారని... ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతున్నా తండ్రీ కొడుకులైన ములాయం, అఖిలేష్ లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఉత్తరప్రదేశ్ లో మదర్సాల అభివృద్ధికి సమాజ్ వాదీ ప్రభుత్వం బాగా డబ్బులు ఖర్చుపెడుతోందని... అయితే సంస్కృత విద్యాలయాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో కొన్ని నెలలుగా సంస్కృత విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ములాయంకు హిందూ సంస్కృతి మీద నమ్మకం లేకపోతే... భారతదేశంలో ఉండే అర్హత కూడా లేనట్టేనని... తక్షణం ఆయన పాకిస్తాన్ వెళ్లిపోవాలని యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించారు.