: హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుపై నీలినీడలు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సందేహాల నీడలు కమ్ముకున్నాయి. యూపీఏ-2 చివరి దశలో హైదరాబాద్ నగరానికి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేటాయించింది. అయితే, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో, ఈ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి ఏమిటో తెలుసుకోవడానికి టీఎస్ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. యూపీఏ-2 అధికారంలో ఉన్నప్పుడు... రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును కేటాయించారు. సుమారు 15 నుంచి 20 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుకు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఐటీరంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి కాగా, ఐటీఐఆర్ ద్వారా మరో కోటి మంది జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఐదేళ్లలో ఐటీఐఆర్ తొలి దశ పూర్తి కావాలి. దీనివల్ల దాదాపు ఆరు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. యూపీఏ చివరి దశలో ప్రకటించిన ప్రాజెక్టుపై కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, తిరుపతి నగరాలకు ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం విధానం ఏమిటో తెలుసుకోవడానికి... ఈనెల 15న ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలవనున్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి కేంద్రం ఏమనుకుంటోంది... నిధుల సమీకరణ ఎలా చేయాలి... కేంద్రం ఎంత పర్సంటేజ్ నిధులు ఇస్తుంది... రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు భరించాలి? అనేది స్పష్టం చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టు అధికారులు తెలిపారు. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే... ప్రయివేట్ భాగస్వామ్యంతోనైనా సరే... సొంతంగా ప్రాజెక్టు చేపట్టాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం స్పందన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.