: కేజ్రీవాల్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: బీజేపీ
ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీరుపై ఢిల్లీ బీజేపీ మండిపడింది. ఢిల్లీలో బీజేపీ సెక్రటరీ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, ఢిల్లీలో అధికారం చేపట్టే హక్కును కేజ్రీవాల్ ఎప్పుడో కోల్పోయాడని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన 49 రోజులకే పదవి నుంచి వైదొలగిన కేజ్రీవాల్ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ గవర్నర్ పై చేసిన ఆరోపణలు దురదృష్టకరమని ఆయన తెలిపారు. గతంలో తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ తోనే కేజ్రీవాల్ పొత్తు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల్లోని అవినీతి గురించి మాట్లాడే కేజ్రీవాల్ తన పార్టీలోని అవినీతిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.