: ఈ ప్రశ్నలకు మీడియా వద్ద సమాధానముందా?: రాజమౌళి ప్రశ్న
వ్యభిచారం కేసులో పట్టుబడిన సినీ నటి శ్వేతబసు ప్రసాద్ పై ప్రాంతీయ, జాతీయ మీడియా పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రసారం చేసిన తీరుపై 'కహానీ ఘర్ ఘర్ కీ' టీవీ సీరియల్ లో శ్వేతకు తల్లిగా నటించిన సాక్షి తన్వర్ మండిపడిన సంగతి తెలిసిదే. ఆమె వేసిన ప్రశ్నలనే తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి, మీడియాను, ప్రజలను అడిగారు. ఈ మేరకు ఆయన ఓ వ్యాసం ట్వీట్ చేశారు. దాని వివరాలివే... ఈ వ్యవహారంలో పట్టుబడిన బిజినెస్ మెన్ కు ఏ శిక్ష పడింది? అని ప్రశ్నించారు. అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అని అడిగారు. అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, ఆక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు. పుంఖానుపుంఖాలుగా ప్రసారం చేసిన కథనాల్లో శ్వేత బసు కోణంలో మీడియా ఎందుకు ఆలోచించలేదన్నారు. పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని ఎందుకు మీడియా పట్టించుకోవడం లేదని అడిగారు. ఇన్ని కథనాలు చూసిన శ్వేత బసు తల్లి వేదనను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇన్ని కథనాలు చూసిన శ్వేత బసు ప్రసాద్ ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులు ఎవరు? అంటూ ఆయన నిలదీశారు. సెన్సిటివ్ విషయాన్ని బజారుకీడ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ప్రశ్నలన్నింటికీ మన వద్ద సమాధానం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.