: ఆ ఇద్దరూ వరల్డ్ కప్ వరకు టీమిండియాతో ఉండాలి: వీవీఎస్ లక్ష్మణ్


టీమిండియా కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి, హెడ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ ల సేవలు టీమిండియాకు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నాడు దిగ్గజ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ జట్టుతో ఉండాలని సూచించాడు. వారి అనుభవం, పరిజ్ఞానం జట్టు సభ్యులకు విశేషంగా లాభిస్తుందని ఈ హైదరాబాదీ తెలిపాడు. 2015 వరకు వారు జట్టుతో ఉండడం ద్వారా వరల్డ్ కప్ సందర్భంగా జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. వీరే కాకుండా, సహాయ కోచ్ లుగా కొత్తగా నియమితులైన సంజయ్ బంగర్, ఆర్.శ్రీధర్, భరత్ అరుణ్ లను కూడా కొనసాగించాలని లక్ష్మణ్ సూచించాడు. ఇక, ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ పైనా తన అభిప్రాయాలు వెల్లడించాడీ మణికట్టు మాంత్రికుడు. ఆ సిరీస్ లో టీమిండియా రెండు అంశాల్లో లోపభూయిష్టంగా కనిపించిందని తెలిపాడు. చివరి ఓవర్లలో బౌలింగ్, ఓపెనింగ్ కాంబినేషన్... ఈ రెండు అంశాల్లోనూ భారత్ ఇంకా మెరుగుపడాలని సూచించాడు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాలో టీమిండియా ముక్కోణపు టోర్నీ ఆడనుండడం లాభించే విషయమని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ టోర్నీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరగనున్న నేపథ్యంలో, అక్కడి పరిస్థితులకు ముందుగానే అలవాటు పడేందుకు అదో చక్కని అవకాశమని అన్నాడు.

  • Loading...

More Telugu News