: నా మోచేయి నిర్మాణమే అంత: పాక్ స్పిన్నర్ అజ్మల్ వివరణ
నియమావళికి విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ ఉందంటూ పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే. ఐసీసీ నిర్ణయంపై అజ్మల్ మాట్లాడుతూ, తన మోచేయి నిర్మాణం అసహజంగా ఉందని తెలిపాడు. స్వస్థలం ఫైసలాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, "నా మోచేయి సాధారణంగా లేదు. ఈ కారణంగా... బౌలింగ్ చేసేటప్పుడు 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగినట్టు కనిపిస్తుంది" అని వివరించాడు. ఐసీసీ బౌలింగ్ నిబంధనల ప్రకారం మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు. కాగా, ఐసీసీ నిర్ణయంపై త్వరలోనే అప్పీల్ చేస్తానని తెలిపాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. అజ్మల్ ఇప్పటివరకు 35 టెస్టుల్లో 178 వికెట్లు, 111 వన్డేల్లో 183 వికెట్లు తీశాడు.