: పదికిలోమీటర్ల లోతున పాతర వేస్తా... మెడలు విరిచేస్తా: టీవీ9,ఏబీఎన్ లకు కేసీఆర్ హెచ్చరిక
వరంగల్ లో జరిగిన కాళోజీ శతజయంతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల పై విరుచుకుపడ్డారు. ఆ రెండు చానళ్లు తనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం లేదని... తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను తాను కూడా గౌరవిస్తానని... అయితే, ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే తాను క్షమించనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ శాసససభా సమావేశాల మొదటి రోజు తెలంగాణ శాసససభ్యులను పాచికల్లు తాగు ముఖాలంటూ... ల్యాప్ ట్యాప్ ఇస్తే చూడడం కూడా రాదంటూ... అవమానకరరీతిలో ఓ కార్యక్రమం ప్రసారం చేశారని ఆయన అన్నారు. 'పాచికల్లు తాగే ముఖాలంటే క్షమించాలా..? పాతర ... పాతర వేస్తాం... పదికిలోమీటర్ల లోతున' అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయినా , ఆ చానళ్ల ప్రసారాలను తాను నిలిపివేయించలేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభ ఆ ఛానల్స్పై ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని... ఆ వ్యవహారం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. దానికి స్పందించిన ఎంఎస్వోలు ఆ రెండు ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఎమ్మెస్వోలకు తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి అనవసర రాద్ధాంతం చేశారని ఆయన విమర్శించారు. సదరు ఛానళ్లలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. తన దృష్టిలో అవి చానల్సే కాదని... తెలంగాణ అస్తిత్త్వాన్ని... వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తే మెడలు విరిచేస్తానని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఉండాలంటే తెలంగాణ సమాజాన్ని గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సొంత ప్రాంతాన్ని గౌరవించని ప్రాంతీయుడిని పాతర వేస్తామని... ప్రాంతేతరుడయితే తరిమి తరిమి కొడతామన్న కాళోజీ వ్యాఖ్యలే తనకు స్ఫూర్తి అని కేసీఆర్ అన్నారు.