: ప్రాణం తీసిన ఇడ్లీ!
ఓనం పండుగ అంటే వెంటనే కేరళ గుర్తొస్తుంది. పడవ పందాలు, ప్రత్యేక వంటకాలతో కేరళీయులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ పర్యాయం ఓనం సందర్భంగా కేరళలోని పాలక్కాడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఓనం ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక క్లబ్ నిర్వహించిన తిండి పోటీలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడు. ఇడ్లీలు వేగంగా తినే పోటీలో పాల్గొన్న కందముతన్ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా తినే ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయింది. అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కందముతన్ అప్పటికే మరణించాడని పోలీసులు తెలిపారు.