: లౌక్యం ప్రదర్శిస్తున్న రవిశాస్త్రి


టీమిండియా కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి తానెంతటి విజ్ఞుడో మరోసారి చాటుకున్నాడు. భారత జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చాడు. వాస్తవానికి, ఇంగ్లండ్ టూర్లో టీమిండియా ప్రదర్శనపై రవిశాస్త్రి బీసీసీఐకి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఆ నివేదికతో ఫ్లెచర్ భవితవ్యం ముడిపడి ఉంటుందని అందరూ భావించారు. కానీ, అంతకుముందే, రవిశాస్త్రి టీమిండియా కోచ్ ను ఆకాశానికెత్తేశాడు. "అద్భుతమైన వ్యక్తి. కోచ్ గా 100 టెస్టులు పూర్తి చేయడం మామూలు విషయం కాదు. సాంకేతికంగా ఫ్లెచర్ పరిపుష్ఠత కలిగిన వ్యక్తి. దృఢ స్వభావి. ఓ తండ్రిలా గౌరవించదగిన వ్యక్తి" అని కొనియాడాడు. కాగా, శాస్త్రి తాజా వ్యాఖ్యల వెనుక లౌక్యం దాగి ఉందన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం. ఇప్పుడు తాను ఫ్లెచర్ పనితీరును ఎండగడితే, అతడిని వెంటనే తప్పిస్తారన్న విషయం శాస్త్రికి తెలియంది కాదు. ఫ్లెచర్ ను తప్పిస్తే అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సింది తానే అన్న విషయమూ ఈ ముంబైవాలాకు ఎరుకే. అప్పుడు, వరల్డ్ కప్ రూపంలో సిసలైన అగ్నిపరీక్ష శాస్త్రి ముందర నిలుస్తుంది. ధోనీ సేన కప్ గెలిస్తే సరి, ఓడితే మాత్రం దాంట్లో శాస్త్రికీ భాగస్వామ్యం కల్పించేందుకు మన మీడియా ఎక్కడా వెనకాడబోదు. అలాకాకుండా, జట్టుకు కోచింగ్ డైరక్టర్ గా ఉంటూ, కోచింగ్ బాధ్యతలు ఫ్లెచర్ కే అప్పగించి, వరల్డ్ కప్ వరకూ నెట్టుకురావాలని శాస్త్రి యోచన అని క్రీడా నిపుణులంటున్నారు. బీసీసీఐ వైఖరి, మీడియా ధోరణులు తదితర అంశాలన్నీ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే.... రవిశాస్త్రి జింబాబ్వే జాతీయుడు ఫ్లెచర్ కు కితాబిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News