: కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నందుకే పరామర్శలకు వెళ్లట్లేదు: పొన్నాల వింత వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సోమవారం కొత్త తరహా వ్యాఖ్యలు చేశారు. సోమవారం మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పరామర్శలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. "కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారు. ఆయనలో మరింత అభద్రతా భావాన్ని పెంచొద్దనే ఉద్దేశంతోనే కరవు బారిన పడిన రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్లడం లేదు. అలాగే తుమ్మల నాగేశ్వరరావును కూడా పరామర్శించే ఓపిక, తీరిక ఉన్నాయి. కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నాను. విద్యుత్ కోతలు, కరవుతో ప్రజలు సతమతమవుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇతర పార్టీల నేతలపై ఆకర్ష్ వల విసిరే పనిలో నిమగ్నమైన కేసీఆర్ కు తీరికెక్కడిది?" అంటూ పొన్నాల తనదైన శైలిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.