: కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట మహిళా జర్నలిస్టులపై పోలీసుల జులుం... ఉద్రిక్తత
టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడాన్ని నిరసిస్తూ... సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట మహిళా జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రజాస్వామ్య బద్ధంగా మహిళా జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్ల చేత వారిని బలవంతంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. పోలీసుల చర్యను మహిళా జర్నలిస్టులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల చర్య సిగ్గు సిగ్గు... పోలీసుల దౌర్జన్యం నశించాలి... వీ వాంట్ జస్టిస్ అంటూ మహిళా జర్నలిస్టులు నినదిస్తున్నారు. ప్రజా సమస్యలను వేలెత్తి చూపే తమపైనే జులుం ప్రదర్శిస్తారా? అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ స్తంభించింది.