: ప్యారగాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ‘ఈగ’ సుదీప్
ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ప్యారగాన్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ ను నియమించుకుంది. సోమవారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. ఆఫీస్ చెప్పల్ పేరిట మార్కెట్ లోకి వచ్చిన తమ పాదరక్షలకు సుదీప్ ‘టఫ్ అండ్ స్టైలిష్’ నినాదంతో సరికొత్త రీతిలో ప్రచారం చేయనున్నారని ప్యారగాన్ మార్కెటింగ్ డైరెక్టర్ జోసెఫ్ జక్రియా చెప్పారు. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సుదీప్ ఒప్పుకోవడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. సుదీప్ ప్రచారంతో తమ ఉత్పత్తుల విక్రయాలు మరింత మేర పెరగనున్నాయని జక్రియా చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుదీప్, ఏదైనా వస్తువుపై తనకు నమ్మకముంటేనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు అంగీకరిస్తానని చెప్పారు. తన అభిమానులు నాణ్యమైన ఉత్పత్తులు కొనేలా ప్రోత్సహించేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్యారగాన్ చెప్పులను తన తండ్రి వాడారని కూడా సుదీప్ వెల్లడించారు.