: ‘మోడీ మంత్ర’తో జార్ఖండ్ లో విజయం సాధిద్దాం: అమిత్ షా
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు వినియోగించిన మోడీ మంత్రను జార్ఖండ్ లోనూ ప్రయోగించి విజయం సాధిద్దామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. సోమవారం రాంచీలో పర్యటించిన సందర్భంగా రాష్ట్రంలో సొంతంగా మెజార్టీ సాధించేందుకు మోడీ నేతృత్వంలో ఎన్నికలకు వెళదామని అమిత్ షా ప్రకటించారు. మోడీ మంత్రతో రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ సహకారం లేకుండానే సంపూర్ణ మెజార్టీ సాధించే దిశగా ముందుకెళదామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని ప్రస్తుతానికి పక్కనబెడదాం, కేవలం ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధానిగా మోడీ సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటూ బరిలోకి దిగుదాం. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుందాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. వంద రోజుల పాలనలో మోడీ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లడుగుదామన్న అమిత్ షా, హేమంత్ సోరెన్ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు. పక్షపాత వైరితో వ్యవహరిస్తున్న హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రానున్న ఎన్నికలను ప్రజలు ఆయుధంగా మలచుకుంటారని షా ఈ సందర్భంగా చెప్పారు.