: హైదరాబాదులో నెమ్మదిగా జరుగుతోన్న వినాయక నిమజ్జనాలు...నేటి సాయంత్రానికి పూర్తి
వినాయక నిమజ్జనాలు ఈ ఏడాది చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఈ కారణంగా ఖైరతాబాద్ గణేశుడి శోభా యాత్ర చాలా ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. రాత్రి రెండు గంటల అనంతరం ప్రత్యేక వాహనంపై ఖైరతాబాద్ గణపయ్యను చేర్చారు. అనంతరం వాహనానికి వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. ఇదంతా పూర్తయ్యేసరికి తెల్లవారుజామున మూడు గంటలయ్యింది. అనంతరం శోభాయాత్రను ప్రారంభించడానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. కానీ పోలీసులు ట్రాఫిక్ కారణంగా రూట్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను నిర్వహించలేదు. ఉదయం 6గంటల వరకు కూడా శోబాయాత్ర ప్రారంభమవకపోవడంతో...ఈ యాత్రను చూడటానికి వచ్చిన వేలాది భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతి ఏడాదికి భిన్నంగా ఈ సంవత్సరం నిమజ్జనాల కార్యక్రమం నెమ్మదిగా జరుగుతోంది. దీంతో ఈ ఏడాది నిమజ్జనాలు నేటి సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.