: గోదారి ధాటికి నరకం చూసిన నిండు చూలాలు
మన మన్యం గ్రామాల దుస్థితిని కళ్లకు కట్టే దారుణం భద్రాచలం మన్యంలో చోటు చేసుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున నీరు చేరుతుండడంతో గోదావరి నది పోటెత్తుతోంది. భద్రాచలం ముంపు గ్రామాలను వరదనీరు ముంచెత్తుతోంది. ఇంతలో చర్ల మండలం శివారు లెనిన్ కాలనీకి చెందిన గర్భవతి నందినికి నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అతి కష్టం మీద చర్ల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యాధికారిణి వసంత, నందినిని భద్రాచలం తీసుకెళ్లాలని సూచించారు. చర్ల నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన రహదారులను వరదనీరు ముంచెత్తడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న నందినిని నానా అవస్థలుపడి పడవ మీద కుదునూరు వరకు తీసుకెళ్లారు. దుమ్ముగూడెం మండలంలో సైతం ప్రధాన రహదారులను నీరు ముంచెత్తడంతో తాలిపేరు కాలువ కట్టమీద నుంచి ఆమెను తరలించేందుకు సీఐ నరేందర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి మూడుగంటలు నరకం చూసిన నిండుచూలాలు నందినిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో నందిని బిడ్డను దక్కించుకోలేకపోయింది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటోంది.