: రాజధాని కోసం టీడీపీలో సుజనా, సీఎం వర్గాల పట్టు: పార్థసారధి
రాజధాని కోసం టీడీపీలో ఎంపీలు సుజనా గ్రూపు, సీఎం రమేష్ గ్రూపు పట్టుపడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పార్థసారధి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సుజనా గ్రూపుకు అమలాపురం రాజధాని కావాలని, సీఎం రమేష్ వర్గం నూజివీడు వైపు రాజధాని చేయాలని పట్టుపడుతున్నాయని అన్నారు. విజయవాడ పరిసరాల్లో టీడీపీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోందని ఆయన తెలిపారు. టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభనష్టాల బేరీజు వేసుకున్న తరువాత కానీ కొత్త రాజధానిపై స్పష్టత రాదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కేబినెట్ లో బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందని అన్నారు. కొత్త రాజధానిలో బడుగు బలహీన వర్గాలు బతికేలా ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. పోలవరం టెండర్ల కేటాయింపుల్లో పెదబాబు, చినబాబులకు దక్కిన వాటాలెంతని ఆయన ప్రశ్నించారు. పోలవరం అవకతవకలపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు అదే విస్తీర్ణంలో భూములు కేటాయించాలని పార్థసారధి సూచించారు.