: ఆప్ 'ఉచ్చులో' పడి విలవిలలాడుతోన్న ఢిల్లీ బీజేపీ
ఆమ్ ఆద్మీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో ఢిల్లీ బీజేపీ విలవిలలాడుతోంది. ఈ ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ఓ స్టింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బీజేపీ నాయకుడు షేర్ సింగ్ దాగార్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మోహనియాకు రూ. 4 కోట్లు 'ఆఫర్' చేశాడు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు గాను... షేర్ సింగ్ దిగార్ ఈ 'ప్రపోజల్'ను దినేష్ ముందు ఉంచాడు. ఈ వీడియోను ఈ ఉదయం ప్రెస్ కు రిలీజ్ చేయడమే కాకుండా... యు ట్యూబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది... ఈ పరిణామం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీకి శరాఘాతంలా పరిణమించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా... షేర్ సింగ్ దాగార్ ను వెనుకేసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ మ.2 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ప్రకటించింది. అయితే, ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం సూచనతో ఢిల్లీ బీజేపీ నాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రెస్ మీట్ రద్దు చేసింది. షేర్ సింగ్ దాగార్ పెద్ద తప్పుచేశారని... ఈ విషయంలో ఆయనను వెనుకేసుకొస్తే పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ వివాదంలో షేర్ సింగ్ దుగార్ ను ఒంటరిగా వదిలివేయాలని ఆ పార్టీ నిశ్చయించుకుంది. ఈ వీడియో ఫుటేజ్ రేపు సుప్రీంకోర్టులో ప్రవేశపెడతామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అలాగే, బీజేపీ నాయకుడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు... ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు చాలా నిజాయతీ కలిగిన వారని... వారు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.