: ఆ పద్ధతిలో అయితేనే రాజధాని కోసం భూములిస్తాం: మంగళగిరి రైతులు


విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో అనుసరించిన భూసేకరణ విధానాన్నే నూతన రాజధాని నిర్మాణం కోసం కూడా అనుసరిస్తే, తాము భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళగిరి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకం ద్వారా విజయవాడకు సమీపంలో ఉన్న జక్కంపూడిలో పేదలకు గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించింది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సేకరించిన భూమిలో 40 శాతం స్థలాన్ని గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన 60 శాతం భూమిని అభివృద్ధి చేసి సంబంధిత రైతులకు అందజేసింది. ఆదివారం మంగళగిరి సబ్ డివిజన్ లో జరిగిన రైతులు, మేధావులు, ప్రజాసంఘాల ఐక్యతా సదస్సులో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. రాజధాని వస్తే... అభివృద్ధి చేసిన భూములతో గరిష్ట ధర వస్తుందని రైతులందరికీ వివరించే నిమిత్తం 18 మందితోకూడిన కమిటీని ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతులందరికీ ఉపాధి కల్పించాలని.... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసేకరణ కమిటీ స్థానిక రైతులతో సమావేశం కావాలని సదస్సులో మరికొన్ని తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో జక్కంపూడి రైతులు తమ అనుభవాలను స్థానిక రైతులకు వివరించారు.

  • Loading...

More Telugu News