: ఏపీ అసెంబ్లీలో ‘ఆ ఇద్దరి’ నామస్మరణే!
గడచిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఇద్దరు నేతలు లేరు. అసెంబ్లీలోనే కాదు భూమిపైనే లేరు. ఒకరు 20 ఏళ్ల క్రితం, మరొకరు ఐదేళ్ల క్రితం మరణించారు. అయినా ఆ ఇద్దరు నేతలే అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రతిపక్షం వాదనలకు ఆధారం అయ్యారు. వారే దివంగత నేత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు, రాష్ట్ర సంక్షేమ రంగానికి కొత్త నిర్వచనం చెప్పిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి! బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వైఎస్ సంక్షేమ పథకాలను వల్లె వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ను నిలువరించేందుకు టీడీపీ ఎన్టీఆర్ జపం చేయక తప్పలేదు. దాదాపు 20 ఏళ్ల క్రితం దివంగతులైన ఎన్టీఆర్, నేటికీ టీడీపీకి తురుపు ముక్కే. సభలో మాట్లాడిన ప్రతి టీడీపీ సభ్యుడు, ఎన్టీఆర్ పాలనను, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. అయితే తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనను ప్రస్తావించిన సాహసం మాత్రం చేయలేకపోయారు. ఇక కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ కు వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు తప్పించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీంతో ఆద్యంతం వైఎస్ సంక్షేమ పథకాలనే ఆ పార్టీ సభ్యులు సభలో వల్లె వేశారు. ఇదిలా ఉంటే, ఆ ఇద్దరి పేర్లను వాడుకుంటున్న రెండు పార్టీలు, ఆ నేతలు కొనసాగిన పార్టీలను వదిలి వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. టీడీపీ, ఎన్టీఆర్ స్థాపించినదే అయినా, ఆయనను విభేదించిన చంద్రబాబు, పార్టీలో చీలిక తెచ్చి, ఎన్నికల సంఘం చేత తమ చీలిక వర్గాన్నే టీడీపీగా ప్రకటించుకున్నారు. అందులో ఎన్టీఆర్ కు చోటు లేదు. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి దాకా కాంగ్రెస్ లో కొనసాగగా, ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీని పెట్టుకున్నారు.