: ఢిల్లీలో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించకుండా ఎందుకు వెళ్లిపోయారంటే...!
ఢిల్లీలో రెండురోజుల పాటు ప్రధానమంత్రి... మిగతా కేంద్రమంత్రులను కలిసినా కూడా కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించకుండా తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చినప్పుడు... ఆ వివరాలను తెలియచేస్తూ రాష్ట్ర మీడియాతో పాటు... జాతీయమీడియాతో కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, కేసీఆర్ కూడా ముఖ్యమైన పర్యటనలప్పుడు కచ్చితంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే, ఈసారి ఢిల్లీలో మీడియా ప్రతినిధులు నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని ఊహించి కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించకుండా వెళ్లిపోయారు. శనివారం ప్రధానిని కలసేందుకు వెళ్లాల్సిన సమయంలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల నిషేధంపై మీడియా ప్రతినిధులు కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తుండడంతో... ఆయన వెనుక ద్వారం గుండా ప్రధానిని కలవడానికి వెళ్లారు. ఆ తర్వాత రోజు అంటే ఆదివారం కూడా ఢిల్లీ మీడియా ప్రతినిధులు కేసీఆర్ ఢిల్లీ నివాసం ముందు వరుసగా రెండో రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మీడియా ప్రతినిధులును పోలీసులు ఆరెస్ట్ చేయడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. వీరికి జాతీయ మీడియా ప్రతినిధులు కూడా తమ మద్దతు తెలిపారు. రాజ్ దీప్ సర్ధేశాయ్ వంటి మీడియా లెజెండ్స్ కూడా టీవీ ఛానళ్ల నిషేధాన్ని... జర్నలిస్ట్ ల అరెస్ట్ ను ఖండిస్తూ తన మద్దతు తెలిపారు. దీంతో ప్రెస్ మీట్ నిర్వహిస్తే... విలేకరులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారని... జాతీయ పత్రికా ప్రతినిధులు కూడా నిషేధం విషయాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారని సమాచారం రావడంతో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించకుండానే వెళ్లిపోయారు.