: ధోనీ ఫినిషింగ్ టచ్ పనిచేయలేదు!


ప్రపంచ కప్ లో టీమిండియాకు కప్ ను అందించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ టచ్ ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టీ20లో మాత్రం పనిచేయలేదు. దీంతో మ్యాచ్ గెలుస్తుందనుకున్న టీమిండియా పరాజయంతో ఇంగ్లండ్ టూర్ ను ముగించింది. 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్ బాగానే ఆడారు. ఇంగ్లండ్ టూర్ లో పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశపరచిన కోహ్లీ కూడా చివరి మ్యాచ్ లో పుంజుకున్నాడు. అయితే, అతడు పెవిలియన్ చేరగానే ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కోహ్లీ వెనుదిరిగిన తర్వాత రైనా, జడేజా కూడా ఔటవడంతో భారత శిబిరం ఒత్తిడిలో కూరుకుపోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి రావడంతో టీమిండియా పని అయిపోయినట్లేనని భావించిన అభిమానులకు తొలి బంతినే సిక్సర్ గా మలిచిన ధోనీ, మ్యాచ్ పై ఆశలు చిగురింపజేశాడు. మళ్లీ మూడు బంతుల్లో 9 పరుగులు, ధోనీ హెలికాఫ్టర్ షాట్ల నేపథ్యంలో పెద్ద కష్టమేమీ కాదనుకున్నారు. ధోనీ కూడా నాలుగో బంతిని బౌండరీ దాటించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు కావాలి. ధోనీ స్ట్రైకింగ్ లో ఉండటంతో టీమిండియా గెలిచిందనే అనుకున్నారంతా, అయితే మునుపెన్నడూ ఫెయిల్ కాని ధోనీ ఫినిషింగ్ టచ్ ఈసారి విఫలమైంది. చివరి రెండు బంతుల్లో ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే రాబట్టడంతో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది.

  • Loading...

More Telugu News