: రేపే ‘నిఠారి’ హంతకుడు కోలీకి ఉరి!
సంచలనం రేపిన నిఠారి హత్యల నరరూప రాక్షసుడు సురేంద్ర కోలీని సోమవారం ఉదయం ఉరి తీయనున్నారు. మీరట్ జైలులో కోలీకి సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మీరట్ జైలు అధికారులు చెబుతున్నారు. కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన నేపథ్యంలో కోలీకి ఉరి శిక్ష అమలు చేయాలని ఘజియాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 4న ఘజియాబాద్ జైలు నుంచి మీరట్ జైలుకు కోలీని తరలించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7-12 తేదీల మధ్య ఏ రోజైనా కోలీని ఉరి తీయండంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోలీకి ఉరి శిక్ష అమలు చేసేందుకు ఈ నెల 12 వరకు ఎందుకు ఆగాలన్న భావనతో సోమవారమే ఉరి శిక్షను అమలు చేసేందుకు మీరట్ జైలు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉరి శిక్ష అమలు కోసం వాడే ఉరితాడు, కొక్కెం తదితరాలు సైనీ సెంట్రల్ జైలు నుంచి తమకు అందాయని మీరట్ జైలు సూపరింటెండెంట్ రిజ్వీ ఆదివారం తెలిపారు.