: తెలంగాణలో వార్తా ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై ఢిల్లీలో ఆందోళన


తెలంగాణలో రెండు వార్తా ఛానళ్ల ప్రసారాలపై కొనసాగుతున్న నిషేధంపై ఆదివారం ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. మీడియా గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న ఎంఎస్ఓలపై తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవాలంటూ న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ ఆదివారం నిరాహార దీక్షకు దిగారు. తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు ఆమె దీక్షకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరుతున్న సమయంలో స్వేచ్ఛ, మరికొంత మంది జర్నలిస్టులతో కలిసి దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్వేచ్ఛతో పాటు సీనియర్ జర్నలిస్టులు శ్రవణ్, రాము తదితరులను అదుపులోకి తీసుకుని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తులపై వారిని విడుదల చేశారు. అయితే తెలంగాణలో నిషేధానికి గురైన వార్తా చానళ్ల ప్రసారాలు పునరుద్ధరణ అయ్యేదాకా దీక్ష విరమించేది లేదని స్వేచ్ఛ తేల్చిచెప్పారు. పోలీసుల చర్యపై పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News