: బండి గుట్టు... ఇక అధికారులకు ఎరుక!
రవాణా శాఖాధికారులు ఇకపై ఆర్సీ, ఇన్స్యూరెన్స్, పర్మిట్ ... తదితర పత్రాలేవీ చూడాల్సిన అవసరం లేదు. గంటల తరబడి అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకే ఒక్క క్లిక్ తో వాహనానికి సంబంధించిన సమస్త సమాచారం తెలిసిపోతుంది. తమ మొబైల్ ఫోన్ లోనే సదరు వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రత్యక్షమయ్యేలా రవాణాశాఖ ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందిస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే... మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ నుంచి జాయింట్ కమిషనర్ వరకు అందరికీ బండి వివరాలు తెలిసిపోతాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే తనిఖీ కోసం వాహనాన్ని ఆపి అధికారి యాప్ లో వాహనం నెంబర్ నొక్కితే చాలు... వాహనం పర్మిట్, పన్ను చెల్లింపులు, జరిమానాలు, బీమా తదితర వివరాలన్నీ మొబైల్ ఫోన్ లో వచ్చేస్తాయి. వాటిని పరిశీలించి వాహనానికి జరిమానా విధించడం నిమిషాల్లో జరిగిపోతుంది. దీని వల్ల పన్నులు, జరిమానాల ఎగవేతలను అరికట్టవచ్చని రవాణాశాఖ భావిస్తోంది. వాహనాల ఫిట్ నెస్ నూ అక్కడికక్కడే తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.