: అమెరికా రికార్డును బద్దలు కొట్టిన రాజస్థాన్ న్యూక్లియర్ ప్లాంట్
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న భారత్ మరో మైలు రాయిని దాటింది. రాజస్థాన్ లోని రావత్ భాతా వద్ద ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ లోని యూనిట్-5... అమెరికా రికార్డును చెరిపేసింది. 220 మెగావాట్ల ఈ రియాక్టర్ 765 (రెండేళ్ల కంటే ఎక్కువ) రోజుల నుంచి నిరంతరాయంగా పనిచేస్తూ ప్రపంచ న్యూక్లియర్ రంగంలో తనదైన సత్తాను చాటింది. అమెరికాలోని ఓ రియాక్టర్ 739 రోజుల పాటు ఎలాంటి షట్ డౌన్ లేకుండా పనిచేయడం విశేషం. ఈ రికార్డుతో, నిరంతరాయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసిన రియాక్టర్ల జాబితాలో రాజస్థాన్ న్యూక్లియర్ ప్లాంట్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం కెనడాలోని ఓంటారియో పవర్ కార్పొరేషన్ కు చెందిన పికరింగ్-7 ప్లాంట్ ది. ఈ ప్లాంట్ ఏకంగా 894 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసి 1994లో మెయింటెనెన్స్ కోసం షట్ డౌన్ అయింది. సాధారణంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏడాదికోసారి మెయింటెనెన్స్ కోసం షట్ డౌన్ చేస్తారు. రాజస్థాన్ న్యూక్లియర్ ప్లాంట్ సాధించిన ఘనతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. "రాజస్థాన్ యూనిట్-5 సాధించిన ఘనత అమోఘం. న్యూక్లియర్ ఎనర్జీ ఎంతో నాణ్యమైన, చవకైన, సమస్యాత్మకం కానిదని యూనిట్-5 ప్రపంచానికి చాటి చెప్పింది" అని ప్రపంచ న్యూక్లియర్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ ఆగ్నెటా రైజింగ్ కితాబిచ్చారు.