: షరీఫ్ ను గద్దె దించేందుకే భారత్ పై ఉగ్ర దాడులు... పాక్ సైన్యం, ఐఎస్ఐ కుతంత్రం


ఇటీవల కాలంలో భారత్ సరిహద్దుల వద్ద పాక్ సైన్యం దాడులు పెరిగిపోయాయి. ఉగ్రవాదులను తన అస్త్రాలుగా మలచుకుని భారత్ పై దాడికి పాక్ సైన్యం వారిని ఉసిగొల్పుతోంది. అయితే, ఇది ఎప్పట్లాగానే జరుగుతున్న సాధారణ తంతు కాదు. దీని వెనుక మహా కుట్ర దాగుంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అంతర్జాతీయ సమాజం ముందు అశక్తుడిగా, అసమర్థుడిగా నిలబెట్టి... అతను పదవి నుంచి తప్పుకునేలా చేయడమే దీని వెనుక దాగున్న కుట్ర. ఈ కుతంత్రం వెనకున్న శక్తులు పాక్ సైన్యం, ఐఎస్ఐ! ఈ వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి రీడెల్ బహిర్గతం చేశారు. రీడెల్ వెల్లడించిన వివరాల ప్రకారం... షరీఫ్ పదివిలోకి వచ్చినప్పటి నుంచి పాక్ సైన్యం, ఐఎస్ఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఎలాగైనా షరీఫ్ ను గద్దె దించాలనే పట్టుదలతో ఇవి ఉన్నాయి. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పి దాడులకు తెగబడితే... పాక్ ప్రధానిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు ఐఎస్ఐ, పాక్ సైన్యం ఇదే ప్లాన్ అమలు చేస్తున్నాయి. షరీఫ్ ను గద్దె దించేందుకు ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్, ఖాద్రీల నాయకత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని మరింత విషమింపజేయడానికి ఇదే సరైన సమయమని ఈ శక్తులు భావిస్తున్నాయి. భారత ఉపఖండంలో తమ గ్రూపు ఏర్పాటు చేస్తున్నామని ఆల్ ఖైదా చీఫ్ జవహరి ప్రకటన కూడా ఇందులో భాగమేనని రీడెల్ విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News