: బీసీసీఐ డైరెక్టర్ రవిశాస్త్రికి ఏడాదికి కోటిన్నర... షరతులు మామూలే!
ఇంగ్లండ్ టూర్ లో టీమిండియాను విజయాలబాట పట్టించిన వెటరన్ క్రికెటర్ రవిశాస్త్రికి బీసీసీఐ భారీ మొత్తాన్ని ముట్టజెప్పనుంది. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైన భారతజట్టులో ఆత్మవిశ్వాసం నింపేందుకు డైరెక్టర్ పోస్టును క్రియేట్ చేసి మరీ రవిశాస్త్రిని టీమిండియాకు మెంటర్ గా నియమించింది. ఇందుకు గాను మాజీ కెప్టెన్ రవిశాస్త్రికి ఏడాదికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇది కేవలం వేతనం మాత్రమే, దీనికి ఇతరత్రా సౌకర్యాలు అదనంగా ఉంటాయి. బీసీసీఐ గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్ట్‌లో ఉన్న కెప్టెన్ ధోని, కోహ్లికి అందే మొత్తం కన్నా ఇది ఎక్కువ మొత్తం. తక్కువ మొత్తంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు బీసీసీఐ ప్రయత్నించినా, రవిశాస్త్రి అందుకు ఇష్టపడలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేతనంలోనే కాకుండా వ్యవహార శైలిపై కూడా ఆయన షరతులు పెట్టినట్టు సమాచారం. రెండేళ్ల పాటు స్వేచ్ఛగా వదిలేస్తేనే డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకుంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. డైరెక్టర్ గా ఉండే కాలంలో తాను టీవీ వ్యాఖ్యాత, మీడియా కాలమిస్ట్‌గా నష్టపోయే పారితోషికాన్ని కూడా కోరినట్టు తెలిసింది. దీంతో అధిక మొత్తంలో బీసీసీఐ ఆయనకు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్టు వెల్లడైంది.