: తెలంగాణ ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండానే: మాజీ డీజీపీ
దళితులకు భూ పంపిణీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల దుర్బర దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నందున నక్సల్స్ ఎజెండా, తెలంగాణ ప్రభుత్వ ఎజెండా ఒకేలా ఉన్నాయని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ డీజీపీ పేర్వారం రాములు అభిప్రాయపడ్డారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని ఆయన స్వగృహంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి ఇంతకాలమైనా ఐఏఎస్, ఐపీఎస్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒక్కరే మూడు, నాలుగు శాఖలు నిర్వహిస్తూ, ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయాల్సి వస్తొందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన సంక్రాంతి నాటికి గాడిలో పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నక్సల్స్ అజెండాను అమలు పరుస్తున్నందువల్ల మావోలతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.