: బీహార్ నుంచి వచ్చిన కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు అవసరమా?: రేవంత్ రెడ్డి
ఉద్యమంలో భవిష్యత్తును సైతం లెక్క చేయని ఉస్మానియా విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కోట్లకు పడగలెత్తిన ప్రభాకర్ రావును మెదక్ లో అభ్యర్థిగా టీఆర్ఎస్ నేతలు నిలబెట్టారని మండిపడ్డారు. వ్యాపారాలు చేసుకునేవారు ప్రజాసేవ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీహార్ నుంచి వలస వచ్చిన దొరబాబు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. "కేటీఆర్ గుంటూరులో చదువుకుని, ఆంధ్రావాళ్లతో వ్యాపారాలు చేసేవాడు. మరి ఆయన ఆంధ్రావాడు కాదా? కేసీఆర్ కు రాజకీయభిక్ష పెట్టిన టీడీపీ ఆంధ్రా పార్టీ కాదా?" అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ జీవితం ఇచ్చిన మెదక్ జిల్లా ప్రజలను కేసీఆర్ లాఠీలతో కొట్టించారని ఆయన విమర్శించారు. బీహార్ నుంచి వలస వచ్చిన మీరు తెలంగాణ వాళ్లా, పుట్టుకతో తెలుగువాళ్లు వేరే ప్రాంతం వాళ్లా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తుమ్మల దిగజారి మాట్లాడడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. తుమ్మల సాక్షిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే తుమ్మలకు వ్యక్తిత్వం లేదని అర్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ నుంచి వచ్చానని కేసీఆర్ ఒప్పుకున్న తరువాత టీఆర్ఎస్ నేతలు ఆయన కింద ఊడిగం ఎలా చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. తక్షణం కేసీఆర్ ను పదవి నుంచి తప్పించండని ఆయన టీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసీఆర్ పదవీ కాంక్షతో తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి నాయకత్వం తెలంగాణకు అవసరమా? అని ఆయన నిలదీశారు. తక్షణం ఆయనను పదవి నుంచి తప్పించి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.