: బ్రెట్ లీ సినిమాకు టైటిల్ దొరికింది!
బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. లీ ప్రధానపాత్రలో వస్తోన్న సినిమాకు 'అన్ ఇండియన్' అని టైటిల్ పెట్టారు. బ్రెట్ లీ నేటివిటీకి తగినట్టుగానే ఈ పేరు ఉందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సిినిమాకు ఆస్ట్రేలియాలో నివసించే అనుపమ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ భారత సంతతి వ్యక్తి నటుడు, నిర్మాత, రచయిత కూడా. ముంబయిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఈ సినిమా వివరాలను ప్రకటించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ఆస్ట్రేలియా ఇండియా ఫిలిం ఫండ్ (ఏఐఎఫ్ఎఫ్) సంస్థ నిర్మిస్తోంది. లీ సరసన తనిష్ట చటర్జీ కథానాయికగా నటిస్తోంది. సినిమా గురించి బ్రెట్ లీ మాట్లాడుతూ... "గత పదేళ్ళుగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది. మంచి అవకాశం" అని పేర్కొన్నాడు.