: ప్రీతిజంటాతో చర్చలు లేవు... షరతులూ లేవు: వాడియా గ్రూప్


బాలీవుడ్ సినీనటి ప్రీతి జింటా నెస్ వాడియాకు ఐదు షరతులు పెట్టినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వాడియా గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు వాడియా గ్రూప్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐపీఎల్ సందర్భంగా మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ సందర్భంగా తనను లైంగికంగా వేధించడమే కాకుండా, నానా దుర్భాషలాడాడంటూ నెస్ వాడియాపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషనులో ప్రీతిజింటా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె లండన్ వెళ్లిపోయింది. తాజాగా ఆమె పెట్టిన కేసు అప్ డేట్స్ గురించిన వార్తలు ముంబై మీడియాలో హల్ చల్ చేశాయి. వాడియా గ్రూప్, ప్రీతి జింటా మధ్య రాజీ ఒప్పందం కుదిరిందని, అందుకు ప్రీతి జింటా 5 షరతులు విధించిందని ఆ వార్తల సారాంశం. దీంతో వాడియా గ్రూప్ తమకు, ప్రీతికి మధ్య చర్చలు జరగలేదని, అలాంటప్పుడు షరతులు, ఒప్పందాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించింది. కాగా, ఆ రోజు వారిద్దరి మధ్య వివాదం జరిగిందని తాము భావించడం లేదని నలుగురు సాక్ష్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News