: ఒబేసిటీ టెక్కీలకు శుభవార్త
టెక్నాలజీ మీద అత్యంత ఎక్కువగా ఆధారపడేవారు.. కంప్యూటర్‌లోనే తమ సమస్త కార్యకలాపాలను నిర్వర్తించేస్తుండేవారు.. శారీరక శ్రమ మీద ఆధారపడేది చాలా తక్కువ. ఇలాంటి వారిలో ఒబేసిటీ సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే .. ఇలాంటి టెక్కీలు తమ ఒబేసిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పుడు అనువుగా ఒక కొత్త అప్లికేషన్ రూపొందింది. తింటున్న ఆహారం, చేస్తున్న వ్యాయామాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. బరువు తగ్గేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. లీడ్స్ యూనివర్సిటీవారు దీన్ని రూపొందించారు. 'మైమీల్ మేట్' పేరిట రూపొందించిన ఈ యాప్‌ను పలువురిపై ఆరునెలలపాటూ ప్రయోగించారు. మనం తిన్న ఆహారంలో కెలోరీలు, చేసిన వ్యాయామం వల్ల కరిగిన కెలోరీల వివరాలను ఇది ప్రతివారం వెల్లడిస్తుంటుంది. బరువు పెరగకుండా అప్రమత్తం చేస్తుంది. దీన్ని వినియోగించిన వారు ఆరునెలల్లో 4.6 కిలోల బరువు తగ్గారట.