: చంద్రబాబుకు 'శుభవార్త' చెప్పిన విజయవాడ రెవెన్యూ అధికారులు
13 జిల్లాలకు కేంద్రస్థానంలో ఉన్నప్పటికీ రాజధానికి సరిపడా భూములు లేకపోవడం విజయవాడకు పెద్ద మైనస్ అని... భూములు ఉన్నప్పటికీ అవి పంట భూములని... పంట భూములను నాశనంచేసి రాజధానిని నిర్మించాలనుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం విజయవాడను రాజధాని చేయాలని ఓ స్పష్టమైన అభిప్రాయానికి ముందే వచ్చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలో చంద్రబాబుకు కూడా మొన్నటి వరకు పూర్తి క్లారిటీ లేదు. అయితే, గురువారం రాజధానిని అసెంబ్లీలో ప్రకటించడానికి ఓ రోజు ముందు... విజయవాడ రెవెన్యూ అధికారులు చంద్రబాబుకు శుభవార్త చెప్పారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న 45,000 ఎకరాల అటవీ భూమిని గుర్తించామని వారు చంద్రబాబుకు తెలిపారు. విజయవాడను ఆనుకుని ఉన్న నున్న, పత్తిపాడు, నైనవరం ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న 14,500 ఎకరాల అటవీభూమిని అధికారులు గుర్తించారు. అలాగే, విజయవాడ శివార్లలోఉన్న ఇబ్రహీంపట్నంలో మరో 10,500 ఎకరాల అటవీభూమిని అధికారులు గుర్తించారు. విజయవాడకు సుమారు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న కంచికచర్లలో 10,500 ఎకరాల భూమిని గుర్తించారు. మరో 15 వేల ఎకరాలను జగ్గయ్యపేట మండలంలో గుర్తించారు. రెవెన్యూ శాఖ నివేదిక అందించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ భూములను డీనోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖను కోరింది.