: లాహోర్ జైల్లో మహబూబ్ నగర్ కుర్రాడు... తాజాగా వివరాలు తెలిశాయి
ఎనిమిదేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి తప్పిపోయిన రమేశ్ (26) అనే కుర్రాడి వివరాలు తాజాగా తెలిశాయి. మహబూబ్ నగర్ నగర్ జిల్లా కోస్గీ ఎస్సీ కాలనీకి చెందిన బసప్ప, లక్ష్మమ్మల మూడో కుమారుడు ఇతడు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్ లోని లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆగస్టు నెలలో ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రమేశ్ అనే భారతీయ యువకుడు పాక్ జైల్లో ఉన్నాడని, వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల కమిషనర్లకు ఆదేశాలు వచ్చాయి. వెంటనే అదే నెలలో అతని ఫొటో సహా మీడియాలో ఈ వార్త వచ్చింది. దాన్ని చూసిన రమేశ్ తల్లిదండ్రులు స్థానిక పోలీసులను కలిశారు. కొడుకుకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని ఈరోజు ఎస్పీ కార్యాలయానికి రావాలని క్రైంబ్రాంచి డీఎస్పీ రామేశ్వర్ రావు వారికి చెప్పారు. అయితే, తన కుమారుడిని ఎలాగయినా ఇక్కడికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తల్లి లక్ష్మమ్మ పోలీసులను వేడుకుంటోంది.