: "తాతకు దగ్గులు నేర్పుతున్నారా?"... అసెంబ్లీలో జగన్ కు చురకలంటించిన చంద్రబాబు
40 ఏళ్ళ అపార రాజకీయ అనుభవమున్న చంద్రబాబునాయుడు... ఐదేళ్లకే రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హోరాహోరీ తలపడుతున్నారు. వైఎస్ జగన్ దూకుడుగా వెళుతూ... ప్రతీ అంశంలో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క అపార అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ కు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తూ ముందుకు పోతున్నారు. తన స్వభావానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో నవ్వూతూ సుతిమెత్తగా చురకలంటించడంలో చంద్రబాబు రాటుదేలారు. అసలు విషయానికి వస్తే... విజయవాడను రాజధానిగా ఏర్పాటు చేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సభలో ఉన్న ప్రతి ఒక్కరూ... వారి ఊరిలో రాజధాని వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని చెప్పారు. కొంతమంది కర్నూలు, మరికొంతమంది ఇడుపులపాయ రాజధాని అయితే బాగుంటుందని భావిస్తున్నారన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఐఐఐటీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇడుపులపాయలో పెట్టారని గుర్తుచేశారు. దీనిపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పెట్టాలన్న అలోచనతోనే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆ ఆలోచన చేశారని... ఆ విషయం చంద్రబాబు తెలుసుకోవాలని చెప్పారు. దీనికి చంద్రబాబు కౌంటర్ ఇస్తూ ''తాతకు దగ్గులు నేర్పుతున్నారా?" అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అసలు ఐఐఐటీ ఆలోచన తీసుకువచ్చిందే తానని... వైఎస్ దానిని మరింత విస్తరించి బాసర, నూజివీడు, ఇడుపులపాయకు తీసుకువెళ్లారని వివరించారు. ఐఐఐటీ ఇడుపులపాయలో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని... కానీ హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టడం తప్పని అన్నారు. జగన్ చరిత్ర చదువుకున్న తర్వాత అసెంబ్లీకి రావాలని చురకలు వేశారు. 'ప్రతీ దానికి చేతులు తిప్పితే ఉపయోగం ఉండదు... కొత్తగా ఎమ్మెల్యే అయ్యావ్, భవిష్యత్తుంది... కాస్త చదువుకో, విషయాలు తెలుసుకో' అంటూ జగన్ కు చంద్రబాబు చురకలంటించారు. తన రాజకీయ జీవితంలో చాలామందిని చూశానని... మర్రి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకులనే తాను ఎదుర్కొన్నానని... మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగన్ తనకు పెద్ద లెక్క కాదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ మౌనం వహించడంతో వాగ్వాదం అక్కడితో ముగిసింది.