: మోడీకి నవాజ్ షరీఫ్ మామిడి పండ్ల రాయబారం!
భారత్, పాక్ సంబంధాల్లో పెద్ద అగాధమే ఏర్పడింది. అయితే దానిని పూడ్చేందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పూనుకున్నట్లుంది. భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్, తన వివాదాస్పద చర్యతో భారత్ నోటిని చేదు చేశారు. ఈ చేదు అనుభవాన్ని భారత్ జీర్ణించుకోలేకపోయింది. వెనువెంటనే చర్చలను రద్దు చేసుకుంది. అయితే తిరిగి భారత్ నోటిని తీపి చేసి, చర్చలను పునరుద్ధరించుకోవాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకేనేమో ఆయన, భారత ప్రధాని నరేంద్ర మోడీకి మామిడి పండ్లతో రాయబారాన్ని నెరిపారు. పాక్ లో తీపికి మారుపేరైన సింద్రీ, ఛౌసా రకాల మామిడి పళ్లతో కూడిన ఓ బుట్టను మోడీకి పంపారు. ఈ బుట్ట అధికారిక దౌత్య మార్గాల ద్వారానే బుధవారం మోడీకి చేరింది. తన మామిడి పండ్ల రాయబారం మోడీకి చేరిందని తెలుసుకున్న షరీఫ్ తీపి వార్త కోసం వేచి చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు న్యూయార్క్ వెళ్లనున్నారు. ఆ సందర్భంగా మోడీతో భేటీకి షరీఫ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిలిచిపోయిన చర్చలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని షరీఫ్ పరోక్షంగా మామిడి పండ్ల రాయబారాన్ని నెరిపారు.